వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తనను ఆరెస్ట్ చేయొద్దంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు హైకోర్టు విచారించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశించింది. మరోవైపు వివేకా హత్య కేసులో సీబీఐ జరుపుతున్న విచారణలో వీడియో రికార్డింగ్ అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. సీబీఐ విచారణపై మాత్రం తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు చెప్పింది. ఆ విషయంలో సీబీఐనే ఆశ్రయించాలని సూచించింది.
వివేకా హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యాక సీబీఐ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డిని పలుమార్లు విచారించింది. మరోసారి విచారణకు రావాలని కూడా నోటీసులు జారీ చేసింది. అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి కూడా విచారణ కోసం సీబీఐ నోటీసులు అందుకున్నారు. దీంతో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ సందర్బంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి రిట్ పిటీషన్ దాఖలు చేశారు. అలాగే న్యాయవాది సమక్షంలోనే సీబీఐ విచారణ జరిగేలా చూడాలని ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. 150 సీఆర్పీసీ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని కోర్టు సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నేడు విచారణ జరిపిన న్యాయ స్థానం అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పునిచ్చింది.