తెలంగాణ హైకోర్ట్ సంచలన తీర్పు.. అది అత్యాచారమే - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ హైకోర్ట్ సంచలన తీర్పు.. అది అత్యాచారమే

April 1, 2022

05

తెలంగాణ హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ ఇష్టపడి కలిసినా అది అత్యాచారమేనని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (15)ను ఖమ్మం జిల్లాకు చెందిన ఆ బాలిక బంధువు అతనికి పెళ్ళై, ఇద్దరు పిల్లలు ఉన్న.. ఆ బాలికను బెదిరించి బయటకు తీసుకెళ్లి పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తాను అంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు. ఈ క్రమంలో బాలిక తరచుగా అనారోగ్యానికి గురవుతూ వస్తుంది. దీంతో గమనించిన తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో బంధువు చేసిన విషయం చెప్పింది. వెంటనే వారు బంజారాహిల్స్ పోలీసులను ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వైద్యపరీక్షలు నిర్వహించగా బాలిక గర్భం దాల్చినట్లు తేలింది. దీంతో బాలిక తల్లి నిలోఫర్ వైద్యులను గర్భాన్ని తొలగించాలని వేడుకుంది. అందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్ట్ కేసుపై విచారణ ముగిసిన అనంతరం.. ”బంధువు చేసిన మోసం కారణంగా వచ్చిన అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి బాలికకు అనుమతులు ఇస్తున్నాం. బాలిక(15)ను ఆమె బంధువు ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి బలవంతంగా బాలికపై లైంగిక వాంఛను తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. 15 సంవత్సరాల బాలిక గర్భాన్ని కొనసాగించడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతుంది. కావున గర్భాన్ని తొలగించాలి. బాలిక ఇష్టపూర్వకంగానే బంధువుతో వెళ్లినా, లైంగికంగా కలిసినా, అది అత్యాచారం పరిధిలోకే వస్తుంది” అని హైకోర్ట్ స్పష్టం చేసింది.