హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఆదివారం జరిగిన కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు (ప్రదీప్) మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తలను పిల్‌గా పరిగణించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ దీనిపై ఈరోజు విచారణ చేయనుంది. ఈ పిటిషన్కు సంబంధించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీని ప్రతివాదులుగా చేసింది.
అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు చిన్నారి తన శక్తి మేర ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. జంతువును వేటాడినట్టుగా కుక్కలన్నీ కలిసి చిన్నారిని అన్నివైపుల నుంచి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. కాగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ.. ఆకలితోనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయని వ్యాఖ్యానించారు. కుక్కలు ఎక్కువగా వున్న ప్రాంతాలపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.
మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం గృహకల్ప కాంప్లెక్స్ ప్రాంగణంలో పార్టీ ప్రతినిధుల బృందం ప్లకార్డులు ప్రదర్శించారు. కుక్కలను అదుపు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలపై కేసులు నమోదు చేయాలని కమిషన్‌ను కోరామని వారు తెలిపారు.