నా మాటలను వక్రీకరించారు..హోంమంత్రి మహమూద్ అలీ - MicTv.in - Telugu News
mictv telugu

నా మాటలను వక్రీకరించారు..హోంమంత్రి మహమూద్ అలీ

December 1, 2019

ప్రియాంకరెడ్డి హత్యాచారంపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ..ప్రియాంక ఆపదలో ఉన్నప్పుడు తన సోదరికి బదులు పోలీసులకు ఫోన్ చేసి ఉంటే కాపాడేవారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను నిన్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ పరామర్శించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే హోంమంత్రి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష నాయకులు హోంమంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి వివరణ ఇచ్చారు.

Telangana.

‘ప్రియాంకరెడ్డి హత్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించడమే కాకుండా.. 24 గంటల లోపు నిందితులను పట్టుకుని న్యాయస్థానంలో హాజరు పరిచింది. కానీ, కొన్ని రాజకీయ పార్టీలు మీడియా సంస్థలు కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశ పూర్వకంగా విమర్శిస్తున్నాయి. ప్రియాంకరెడ్డి విద్యావంతురాలు, వైద్య వృత్తిలో ఉండి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, తన సోదరికి ఫోన్ చేసే బదులు పోలీసులకు సమాచారం ఇస్తే ఈ అనర్థం జరిగి ఉండేది కాదని వ్యాఖ్యానించడంపై కొన్ని రాజకీయ పార్టీలు మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా నా మాటలను వక్రీకరిస్తున్నాయి. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు వ్యవస్థ సహకారం తీసుకుంటాడు. అంటే వ్యక్తి వ్యవస్థను సరైన సమయంలో సంప్రదిస్తే వ్యవస్థ వ్యక్తిని కాపాడుతుంది. ప్రియాంకరెడ్డి గనుక 100కు ఫోన్ చేసి ఉంటే పోలీసులు సరైన సమయంలో బాధితురాలి వద్దకు చేరుకునేవారు. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేసారు. కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు ఇటువంటి సంఘటనలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే చోటుసేసుకుంటున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. ఇప్పటికైనా కొన్ని రాజకీయ పార్టీలు మీడియా సంస్థలు ఇటువంటి అసత్య ప్రచారాన్ని మానుకోవడం మంచిది’ అని తెలిపారు.