Telangana: Huge increase in RTC luggage charges
mictv telugu

తెలంగాణ: భారీగా పెరిగిన ఆర్టీసీ లగేజీ ఛార్జీలు

July 20, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ లగేజీ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో టైర్లు తీసుకెళ్లాలి అంటే మూడింతలు, సైకిల్‌కు అయితే రెండింతల లగేజీ ఛార్టీలను చెల్లించాల్సిందేనని అధికారులు తెలిపారు. ఈ లగేజీ ఛార్జీలను భారీగా పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన కొత్త ఛార్జీలు శుక్రవారం (ఎల్లుండి) నుంచి అమలులోకి వస్తాయని ఆ ఉత్తర్వులో పేర్కొంది.

“లగేజీ ఛార్జీలు సుదీర్ఘకాలంగా ఒకేలా ఉన్న అంశంపై ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో చర్చ జరిగింది. ఈ క్రమంలో ఛార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. 2002 తర్వాత ఈ ఛార్జీలను పెంచిన దాఖలాలు లేవు. డీజిల్ ధరలతోపాటు మానవ వనరుల వ్యయాలు పెరిగాయి. అందుకే లగేజీ ఛార్జీలను పెంచక తప్పటం లేదు. ఆర్టీసీ కార్గో సేవలను ప్రోత్సహించేందుకు ఆ ఛార్జీలతోపాటు వీటిని సమానంగా పెంచాం’ ‘ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇకపై టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ట్రక్కు టైర్లు తరలించాలంటే యూనిట్లుగా పరిగణించి ఛార్జీలు వసూలు చేస్తారు. టీవీ, ఫ్రిజ్, సైకిల్, ఫిలింబాక్సులు, వాషింగ్ మెషీన్, కార్ టైర్లను రెండు యూనిట్లుగా, రేడియో, ఖాళీ బ్యాటరీ, టేబుల్ ఫ్యాన్, 25 లీటర్ల ఖాళీక్యాన్, కంప్యూటర్ మానిటర్, సీపీయూ, హార్మోనియంలను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.