Telangana..Inter supplementary examination schedule released
mictv telugu

తెలంగాణ..ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల

June 30, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను తాజాగా ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలైన ఫలితాలలో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనివారి కోసం, ఎక్కువ మార్కుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. ఇంటర్ అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశామని తెలిపారు.

అధికారులు మాట్లాడుతూ.. ”ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తాం. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి ఏడాది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి” అని అన్నారు.

మరోపక్క విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఈసారి అమ్మాయిల హవా కొనసాగింది. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదైంది. మొత్తం మీద ఫస్టియర్, సెకండియర్ కలిపి 65.24 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంతో పోలిస్తే, రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం కొంత ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు.