నేటి నుంచే ఇంటర్మీడియట్‌ పరీక్షలు.. - MicTv.in - Telugu News
mictv telugu

నేటి నుంచే ఇంటర్మీడియట్‌ పరీక్షలు..

March 15, 2023

Telangana Intermediate Exams Starts From Today

 

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ అన్ని జిల్లాల్లో అన్ని విభాగాల వారిని సమన్వయం చేస్తూ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9  గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రంలోకి అరగంట ముందు నుంచే అనుమతించనున్నారు. 9 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం.. ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో OMR షీట్‌ను విద్యార్థులు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. కచ్చితంగా ఏ రోజుకు ఆ రోజు ఆయా సబెక్టులకు సంబంధించి ప్రశ్నపత్రాన్ని 9 గంటలకు ఇస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించేది లేదని ఇంటర్‌బోర్డు పేర్కొంది.

 

ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,47,699 మంది స్టూడెంట్స్ ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఎంపీసీ, బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈనెల 29వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి. గత రెండు సంవత్సరాలుగా 70 శాతం సిలబస్‌తో పరీక్షలు జరగగా… ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తోపాటు గతంలో మాదిరిగా ఈసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యాధికారులు ఈ పరీక్షల కోసం 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు… 61 సెల్ఫ్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. పరీక్షల కోసం 75 ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించారు.

 

విద్యార్థుల సౌకర్యార్థం అన్ని జిల్లాల కలెక్టర్లకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్‌ మీటింగ్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల సమయాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఇంటర్ విద్యార్థులకు సూచించారు.