Telangana: Interviews for those courses canceled in OU
mictv telugu

గుడ్‌న్యూస్..ఓయూలో పీహెచ్‌డీ ఇంటర్వ్యూలు రద్దు!

July 21, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరబాద్‌లో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు విద్యార్ధినీ, విద్యార్థులకు ఓ శుభవార్తను చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్.డీ చేయాలని ఆశగా ఎదురుచూస్తున్న వారికి ఇకపై అన్నీ డిపార్ట్‌మెంట్‌ల్లో జరగబోయే పీహెచ్.డీ ప్రవేశాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని అధికారులంతా ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇకపై ఉస్మానియాలో కేవలం ప్రవేశ పరీక్షను నిర్వహించి, ఇంటర్వ్యూలు లేకుండా సీట్లను భర్తీ చేయాలని అధికారులు చూస్తున్నారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం..ఎంట్రన్స్ పరీక్షలో మంచి మార్కులు సాధించినప్పటికి ఇంటర్వ్యూకు వచ్చేసరికి సరిగ్గా సమాధానాలు చెప్పలేదన్న వివిధ కారణాలతో విద్యార్థులకు పీహెచ్.డీ సీటు రాక, పలువురు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఈ క్రమంలో ఇకపై ఓయూలో అలాంటి సమస్య లేకుండా ఇంటర్వ్యూలను రద్దు చేసి, కేవలం ఎంట్రన్స్ పరీక్షలో వచ్చిన మార్కులు, నెట్, సెట్ మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యామండలి అన్నీ వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పీహెచ్.డీ సీట్లను భర్తీ చేయాలని అనుమతులు ఇచ్చింది. కానీ, ఇంటర్వ్యూ ఉంటుందా? లేదా అనే విషయాన్ని స్పష్టంగా వివరించలేదు. తాజాగా ఉస్మానియా అధికారులు తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు వర్తించేలా అధికారులు చర్చలు జరిపినట్లు ఆ ఉన్నతాధికారి తెలిపారు. అతిత్వరలోనే ఈ నిర్ణయాన్ని ఓ ప్రకటన రూపంలో విడుదల చేయడానికి అధికారులు సన్నద్దమౌతున్నట్లు ఆయన తెలిపారు.

మరోపక్క తెలంగాణలో మొదటిసారిగా వెలువడిన గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 తరహాలోనే విశ్వవిద్యాలయాల్లో జరిగే పీహెచ్.డీ విషయంలో కూడా ఇంటర్వ్యూలు లేకుండానే సీట్లను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక నెట్, సెట్ ఉండి, ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ సాధించిన వారికే ఈ సీట్లు దక్కనున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ విడుదలవుతుందని అధికారి వివరాలను వెల్లడించారు.