నిత్యావసరాల ధరల మంటలోనూ తెలంగాణ నెంబర్ వన్ - MicTv.in - Telugu News
mictv telugu

నిత్యావసరాల ధరల మంటలోనూ తెలంగాణ నెంబర్ వన్

June 14, 2022

అన్నింటిలోనూ దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. నిత్యావసరాల ధరల పెరుగుదలలోనూ టాప్ ప్లేస్‌లో నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే నిత్యావసరాల ధరలు ఎక్కువగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి 22 రాష్ట్రాల గణాంకాలను కేంద్రం సోమవారం ప్రకటించగా.. అందులో 9.45 శాతంతో తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. రెండోస్థానంలో 8.52 శాతంతో మహారాష్ట్ర, మూడోస్థానంలో 8.49 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. కేవలం 4.82 శాతం ద్రవ్యోల్బణంతో కేరళ రాష్ట్రం చివరిస్థానం పొందింది.

మొత్తం 25 నిత్యావసర వస్తువులకు సంబంధించిన ధరలను కేంద్ర గణాంక శాఖ విడుదల చేయగా.. ఇందులో గత ఏడాదితో పోలిస్తే కోడిగుడ్డు ధర మాత్రమే తగ్గింది. మిగతా 24 నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం 4.27 శాతం నుంచి 18.26 శాతం వరకు పెరిగింది. ఇక పట్టణ ప్రాంతాలకు సంబంధించి ప్రకటించిన ద్రవ్యోల్బణం పెరుగుదల గణాంకాల్లో 8.82 శాతంతో మహారాష్ట్ర ప్రథమస్థానంలో నిలవగా, 8.65 శాతంతో రెండోస్థానంలో తెలంగాణ ఉంది. మూడో స్థానంలో 8.53 శాతంతో జార్ఖండ్‌ నిలిచింది. గత ఏడాది కాలంలో ధరలు ఎక్కువగా పెరిగిన వస్తువుల్లో.. కూరగాయలు ప్రథమస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో వంటనూనెలు, పాదరక్షలు (ఫుట్‌వేర్‌), సుగంధ ద్రవ్యాలు, ఇంధనం ఉన్నాయి.