తనకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమని.. ఇష్టం కోసమే తెలంగాణ గురించి మాట్లాడతానని.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు’ పుస్తకాన్ని పవన్ ఆవిష్కరించారు.
హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ సభలో పవన్ మాట్లాడుతూ.. ‘ప్రపంచాన్ని శాసించే సినిమాలు తెలుగు నుంచి వస్తాయి. మహానటి లాంటి సినిమాలు ఎంతో మందికి ప్రేరణ కలిగించాయి. ఇంకా చాలా మంచి సినిమాలు రావాలి. నాకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టం. ఇష్టం కోసమే తెలంగాణ గురించి మాట్లాడతాను. రాజకీయాల కోసం మాట్లాడబోను. తెలంగాణ నా రక్తం, గుండెల్లో ఉంది’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, రావి కొండలరావు, సుద్దాల అశోక్ తేజ, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.