పచ్చదనంలో తెలంగాణ నంబర్ వన్ - MicTv.in - Telugu News
mictv telugu

పచ్చదనంలో తెలంగాణ నంబర్ వన్

August 9, 2017

నెంబర్ వన్ గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం హరితహారం విషయంలోనూ నెంబర్ వన్ గా నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రేమతో మొక్కల పెంపకం విషయంలో ప్రజలను ప్రోత్సహిస్తున్నారు . ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ లోక్ సభలోప్రకటించారు . ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో ఉన్న వ్యక్తులందరి పేరు మీద మొక్కలు నాటాలని, అలా నాటిన వారికి పాడి పశువులను ఉచితంగా కొనిస్తానని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించారు . ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చదనం విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తున్నారో మరో ఏడాది , రెండేళ్లలో పెరిగి చెట్లుగా ఎదిగే కోట్లాది మొక్కలు ప్రపంచానికి చెప్పనున్నాయి .

అడవుల పెంపకం, పచ్చదనం అభివృద్ధి , మొక్కలు నాటడం వంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. జాతీయ అటవీ పాలసీలోని గ్రీన్ మిషన్, మొక్కల పెంపకం విభాగాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. 2016-17లో దేశవ్యాప్తంగా నాటిన మొక్కల్లో తెలంగాణ 26 శాతం వాటా సాధించింది. కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ మంగళవారం లోక్‌సభలో ఈ వివరాలు ప్రకటించారు. 2016-17లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 80,446 హెక్టార్లలో పచ్చదనాన్ని అభివృద్ధిచేసే లక్ష్యాన్ని నిర్దేశిస్తే, రాష్ట్రం 4,36,913 హెక్టార్లలో ఫలితాన్ని సాధించింది. ఇది నిర్దేశిత లక్ష్యం కంటే ఐదు రెట్లు ఎక్కువ. 2015-16లో సైతం 59970 హెక్టార్ల లక్ష్యానికి గాను 2,36,598 హెక్టార్లలో ఫలితాన్ని సాధించింది. దేశంలో ఏ రాష్ట్రమూ కనీసం తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేదు.
కాగా ఆంధ్రప్రదేశ్ 2.45 లక్షల హెక్టార్లు, ఒడిశా 1.97 లక్షల హెక్టార్ల ఫలితాన్ని సాధించాయని వివరించారు.

దేశంలో 26 శాతం వాటా

2016-17లో దేశవ్యాప్తంగా పచ్చదనం అభివృద్ధి, అడవుల పెంపకంలో లక్ష్యాలను మించిన ఫలితాలు వచ్చాయి. మొత్తం 10.89 లక్షల హెక్టార్ల లక్ష్యాన్ని పెట్టుకోగా 16.83 లక్షల హెక్టార్ల ఫలితం వచ్చింది. ఈ ఫలితాల్లో ఒక్క తెలంగాణ వాటాయే దాదాపు 26 శాతానికి పైగా ఉంది. తెలంగాణకు 80,446 హెక్టార్లలో పచ్చదనం అభివృద్ధి లక్ష్యం ఇవ్వగా డిసెంబరు చివరి నాటికే 4,36,913 హెక్టార్ల ఫలితాన్ని (543% ఎక్కువ) సాధించింది.

మొక్కల పెంపకంలో రికార్డు

మొక్కల పెంపకంలో తెలంగాణ రికార్డు సృష్టించింది. 2016-17లో దేశవ్యాప్తంగా 70.82 కోట్ల మొక్కలు లక్ష్యం కాగా 133.43 కోట్ల మొక్కలు నాటారు. అందులో ఒక్క తెలంగాణలోనే 36.73 కోట్ల మొక్కలను నాటారు. వాస్తవానికి తెలంగాణ రాష్ర్టానికి 5.22 కోట్ల మొక్కల లక్ష్యాన్ని మాత్రమే ఇచ్చారు. అయినా 9 నెలల వ్యవధిలోనే 36.73 కోట్ల మొక్కలను నాటారు. 2015-16లో కూడా 3.89 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి 13.78 కోట్ల మొక్కలను నాటినట్లు వివరించారు. ఇది లక్ష్యానికి మూడు రెట్లు ఎక్కువ. దేశం మొత్తం మీద నాటిన మొక్కల సంఖ్యతో పోలిస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రం వాటానే 27.52%గా ఉందని ఆయన వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 జూన్ మొదలు 2016 డిసెంబరు వరకు రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో రాష్ట్రంలో 54.97 కోట్ల మొక్కలు నాటారని, 7,53,957 హెక్టార్లలో పచ్చదనాన్ని అభివృద్ధి చేశారని మంత్రి తెలిపారు. కాగా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రమంత్రి చెప్పిన వివరాల్లో మొదటి, రెండో విడత నాటిన మొక్కల వివరాలు మాత్రమే పొందుపరిచారు. గత నెలలో చేపట్టిన మూడో విడుత వివరాలు మంత్రి సమాధానంలో లేకపోవడం కొసమెరుపు.