తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లారు. ఐదేళ్ల విరామం తర్వాత ఆ దేశానికి వెళ్తున్నారాయన. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందు అధికారులతో కలసి బయల్దేరారు.
‘తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ మరియు ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి అనేక కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి బృందాలతో సమావేశమవుతారు. వారం రోజులకు పైగా కొనసాగనున్న ఈ పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పలు ఐటి, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశమవుతారు. గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చిన కేటీఆర్ ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నది. మంత్రి కేటీఆర్ తో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు, ఐటీ శాఖకు చెందిన పలు విభాగాల డైరెక్టర్లు ఈ పర్యటనలో పాల్గొంటారు.’ అని టీఆర్ఎస్ తెలిపింది.