Telangana IT Minister KTR praised AP CM YS Jagan Mohan Reddy
mictv telugu

జగన్ పరిపాలన అద్భుతమంటూ కేటీఆర్ ప్రశంసలు.. అసలు మేటర్ వేరే..

September 22, 2022

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలతో ముంచెత్తారు. కష్టాల్లో ఉన్న ఏపీని వైఎస్ జగనే గట్టెక్కించారన్నారు. రాష్ట్రం కష్టాల్లో కూరుకుపోయినపుడు జగన్‌ ముందుండి నడిపించిన తీరు అద్భుతమన్నారు. కరోనా సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్‌ చక్కదిద్దారని రీ డిజైన్‌ చేసిన హిందూ ఇంగ్లీష్‌ పేపర్‌ను కేటీఆర్‌ నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హిందూ ఎడిటోరియల్‌ టీమ్‌తో మాట్లాడిన ఆయన.. సంక్షేమ పథకాలపై ఫోకస్‌ పెట్టిన వైఎస్‌ జగన్‌ అభివృద్ధిని పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని కొంత మంది చేస్తున్న ఆరోపణలను ఖండించారు.

ఏపీ సీఎం జగన్ పాలన సూపరంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. జాతీయ మీడియాలో ఏపీ సీఎం జగన్ ను కొనియాడటం… వెనుక రాజకీయం ఉందనే వాదన వస్తోంది. కొంత కాలంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. బీజేపీ ముక్త భారత్ నినాదంతో దేశమంతా పర్యటిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడతారనే ప్రచారం సాగినా.. కొత్త పార్టీ కాకుండా కూటమి దిశగానే కేసీఆర్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ను ప్రశంసిస్తూ కేటీఆర్ కామెంట్లు చేయడంతో.. బహుశా జాతీయ కూటమితో తమకు మద్దతు ఇస్తారనే ఆశతోనే అలా మాట్లాడి ఉంటారనే టాక్ వినిపిస్తోంది.