తెలంగాణ, కర్ణాటక హైరిస్క్‌.. ఏపీ ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ, కర్ణాటక హైరిస్క్‌.. ఏపీ ప్రకటన

July 13, 2020

statement

కరోనా వైరస్ కేసులు నానాటికి పెరుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హై రిస్క్‌ ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో తెలంగాణ, కర్ణాటకను లోరిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. రెండు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో హై రిస్క్‌ ప్రాంతాలుగా మార్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేసింది. 

ఏపీ క్వారంటైన్‌ విధానంలో మార్పులు ఇలా…

-విదేశాల నుంచి ఏపీకి వచ్చేవారికి ఏడు రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి.

-గల్ఫ్‌ నుంచి వచ్చినవారికి ఉన్న 14 రోజుల క్వారంటైన్ ఏడు రోజులకు కుదింపు.

-విదేశాల నుంచి ఏపీకి తిరిగివచ్చి క్వారంటైన్‌లో ఉన్నవారికి ఐదవ రోజు, ఏడవ రోజు కరోనా పరీక్షలు విధిగా నిర్వహించాలి.

-దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేయాలి.

-స్వాబ్ పరీక్షలను విమానాశ్రయాల్లోనే చేయాలి. ఆ తర్వాత వారందరినీ 14 రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉండేలా వెసులుబాటు కల్పించాలి.

-రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్‌గా పరీక్షల చేయాలి. వారు 14 రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

-రోడ్డు మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్ పోస్టుల వద్దే స్వాబ్ పరీక్షలు నిర్వహించాలి.

-తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులు 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి.

-ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా ఇ-పాస్‌కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాలి.

-రాష్ట్ర సరిహద్దుల వద్ద పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినవారిని తక్షణం వేరు చేసి కొవిడ్ ఆసుపత్రులకు తరలించాలి.

-హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు వాలంటీర్, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలి.