Telangana: KCR good news for farmers..Drones distributed
mictv telugu

తెలంగాణ: రైతన్నలకు కేసీఆర్ శుభవార్త..డ్రోన్లు పంపిణీ

July 20, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల రైతన్నలకు కేసీఆర్ సర్కార్ శుభవార్తను చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఈ ఏడాది నుంచి సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని సంచనల నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని ప్రభుత్వం పలు నిర్ణయాలు ముందుకెళ్తోంది. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్‌ టిల్లర్లు తదితర పరికరాలను సబ్సిడీపై అందజేస్తోన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి రైతులకు ఈ ఏడాది నుంచే సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో రైతులు పురాతన, సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ఆయా యంత్రాలను, పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఎద్దులతో దుక్కిదున్నే సంప్రదాయం వెళ్లి, రాష్ట్రవ్యాప్తంగా ట్రాక్టర్ల ఉపయోగించే వినియోగం భారీగా పెరిగిపోయింది. దీనికి మరింత ఊతం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణ కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో రైతులకు డ్రోన్లు అందజేసే దిశగా వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

”ప్రధానంగా ఈ డ్రోన్లు పురుగు మందులను పిచికారీ (స్ప్రే) చేయడానికి ఉపయోగిస్తారు. డ్రోన్‌ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల నీరు, పురుగుమందులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురి అవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. డ్రోన్‌ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుంది. కొన్ని పంటలకు మొక్కలపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదల్లో చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటకు ఒక్కో రకంగా ఉంటుంది. డ్రోన్లకు అదనపు పరికరాలు సమకూరుస్తారు. పంటకు చీడపీడలు ఏమైనా ఆశించాయా తెలుసుకునేందుకు ఈ డ్రోన్లను ఉపయోగించనున్నారు. పంటల్ని ఫొటోలు తీయడం, వాటిని వ్యవసాయాధికారికి పంపడం చేసేలా కూడా పరికరాలు అమర్చుతారు” అని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.