గణతంత్ర దినోత్సవం రోజు కూడా తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదం నడుస్తున్నది. అందరూ అనుకున్నట్లే ఈసారి రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరించిన గవర్నర్ తమిళి సై.. అనంతరం మాట్లాడుతూ ‘‘అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మాణం కాదు- జాతి నిర్మాణం అభివృద్ధి. ఫామ్ హౌస్‌లు కట్టడం అభివృద్ధి కాదు. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు.. కానీ నాకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం. నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కామెంట్స్‌పై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలవుతుందని అన్నారు. బాధ్యతల్లో ఉన్నవాళ్లే తెలంగాణ అభివృద్దిని గుర్తించకపోవడం బాధకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్లు.. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేసిందని అడిగితే.. జాతీయ రహదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ క్షేత్రాలను, కొత్త భవనాలను విమర్శించడం తగదని అన్నారు. కొందరికి తెలంగాణ అభివృద్ది కనిపించకపోతే చేసేది ఏమి లేదని అన్నారు.
ఇక, తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకవిష్కరణ చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.