Telangana liquor scam should be probed by CBI: Madhuyashki Goud
mictv telugu

తెలంగాణ లిక్కర్ స్కాంపై విచారణ జరగాలి : మధుయాష్కీ గౌడ్

November 11, 2022

Telangana liquor scam should be probed by CBI: Madhuyashki Goud

ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలను పోలిన తెలంగాణ లిక్కర్ పాలసీపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మిగతా నాయకులతో కలిసి వివిధ అంశాలపై మీడియాతో మాట్టాడారు. ఈ సందర్భంగా.. ‘మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడం బాధ కలిగించింది. ఈ ఫలితంపై ఏఐసీసీలో చర్చ జరిగింది. త్వరలో ప్రియాంక గాంధీ తెలంగాణ బాధ్యతలు తీసుకుంటారు. పార్టీ ధిక్కరణకు పాల్పడే ఎంతటి వారైనా చర్యలు తప్పవు. జోడోయాత్రలో అందరు నేతలు కలిసి పని చేయడం సానుకూలాంశం.

ఇలాగే కష్టపడితే కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఆదరించట్లేదో సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంద’న్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రజల దృష్టి మరల్చడానికి టీఆర్ఎస్, బీజేపీలు నాటకమాడుతున్నాయి. ఢిల్లీ వెళ్లి ప్రధాని కాళ్లమీద పడి, ఇక్కడ మాత్రం కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నారు. ఫోన్ ట్యాపింగులో దొంగే దొంగ అన్నట్టుంది. గవర్నర్ కూడా ట్యాపింగ్‌పై వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర హోంశాఖతో విచారణ జరిపించాలి. ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తూ బహుజనులకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోంది. యువతను లిక్కర్, డ్రగ్స్‌‌కి బానిసలుగా చేస్తున్నారు. మద్యం వ్యాపారంలో కల్వకుంట్ల కుటుంబమే ఉంది. బేవరేజెస్ వ్యాపారం కూడా వదలడం లేద’ని ఆరోపించారు.