ఫోటోలు గతించిన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.. వర్తమానాన్ని పొదివిపట్టి భవిష్యత్తు తరాలకు చిత్తరువు కానుకలవుతాయి.. జిందగీ మిగిల్చే జ్ఞాపకానికి ఫోటో ఎప్పుడూ అంటిపెట్టుకొని వుండే ఆత్మీయ నేస్తం అవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని పల్లె సంస్కృతి, ప్రకృతి, ప్రజలకు పెద్ద పీట వేస్తూ ఫోటో ఎగ్జిబిషన్ సాగనున్నది. తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో ‘ తెలంగాణ బతుకు చిత్రం ’ పేరిట ఫిబ్రవరి 2, 3, 4 మూడు రోజుల పాటు ఉదయం గం. 11:00 నుండి సాయంత్రం గం. 7:00 వరకు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది.
రవీంద్రభారతి వేదికగా ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ గ్రామీణ బతుకు చిత్రాలను వీక్షించవచ్చు. గ్రామాల్లోని అప్పటి కట్టడాలు, కూలిన గోడలు, పూరిగుడిసెలు, ఆ తరం మనుషుల కట్టుబొట్లు, ప్రకృతి వంటివన్నీ ఈ గ్యాలరీలో చూడవచ్చు. 35 ఫ్రేములతో ప్రారంభం కానున్న తెలంగాణ బతుకు చిత్రం ఫోటో ఎగ్జిబిషన్‌కు ప్రముఖులు రానున్నారు.
అతిథులు :
గౌరవ అతిథి : కట్టా శేఖర్ రెడ్డి ( నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ )
ముఖ్య అతిథి : గొంగిడి సునీత ( ఆలేరు ఎమ్మెల్యే ), ఎమ్ఎల్సి కర్నె ప్రభాకర్
ఆత్మీయ అతిథి : మామిడి హరికృష్ణ ( తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ )
వీరే కాకుండా వివిధ రంగాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, సెలెబ్రిటీలు, స్నేహితులు, సన్నిహితులు రానున్నారు.
అజహర్ షేక్ :
జీవితాలు ఇలా వుంటాయా అని ఈ తరానికి చెప్తున్న ఫోటోలను తీసిన జర్నలిస్ట్ ఫొటోగ్రాఫర్ అజహర్ షేక్. వృత్తి పరంగా నమస్తే తెలంగాణ జిందగీ డెస్క్ జర్నలిస్ట్. ప్రవత్తిగా తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీ రంగాన్ని ఎంచుకొని ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా కెమెరాను భుజాన వేసుకొని వెళ్ళి ఫొటోలను తీయటం వ్యసనంగా మార్చుకున్నాడు. ఉద్యోగంలో భాగంగా తెలంగాణలోని 31 జిల్లాలు తిరిగాడు. అలా తెలంగాణాలోని కల్చర్, నేచర్, పీపుల్‌పై ఫొటోలు తీయాలని నిర్ణయించుకొన్నాడు.
గ్రామీణ మట్టి మనుషుల జీవితం, వాతావరణం, స్థితిగతులను పొదివి పట్టుకునే ప్రయత్నం చేశాడు. రెండున్నరేళ్ళుగా ఫోటోలు తీస్తున్నాడు. వందల గ్రామాలు తిరిగి వేల ఫొటోలు తీశాడు. తను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలా మంది మిత్రుల ఇవి ఇక్కడికే పరిమితం కాకూడదు. నీలో మూలాలను పట్టుకొనే ఫొటోగ్రాఫర్ వున్నాడు.. దాన్నింకా ఎక్స్పోజ్ చెయ్యాలి అని సలహాలు ఇచ్చారు. ఆ క్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణను కలిసాడు. ఆయన వెంటనే స్పందించి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. అలా ‘ తెలంగాణ బతుకు చిత్రం ’ చిత్రాలు అలరించడానికి రెడీ అయ్యాయి.