Telangana: Lumpy skin disease check...vaccine has arrived
mictv telugu

లంపీస్కిన్‌‌ వ్యాధికి చెక్..టీకా వచ్చేసింది

September 15, 2022

దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా విజృంభిస్తున్న లంపీస్కిన్‌ వ్యాధితో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పశువులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పశువుల యాజమానులు ఏం చేయాలో దిక్కుతోచక అయోమాయంలో పడుతున్నారు. అటువంటివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్తను చెప్పింది. లంపీస్కిన్‌ వ్యాధితో బాధపడుతున్న పశువులకు టీకాను రెడీ చేశామని, ఈ టీకాతో లంపీస్కిన్‌ వ్యాధికి ఇక పులిస్టాప్ పెట్టవచ్చని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ రాంచందర్‌ తెలిపారు.

”దేశవ్యాప్తంగా ప్రబలిన లంపీస్కిన్‌ వ్యాధితో మృత్యువాత పడుతున్న పశువులకు తెలంగాణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ వెటర్నరీ బయోలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (వీబీఆర్‌ఐ) ‘గోట్‌ప్యాక్‌’ అనే పేరుతో వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ పశువుల టీకా తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తుంది. ఎందుకంటే లక్షలాది పశువుల ప్రాణాలను కాపాడుతుంది. రెండు నెలలుగా లంపీస్కిన్‌ వ్యాధి పశువుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే ఈ వ్యాధి ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గుజరాత్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 67 వేల పశువులను పొట్టబెట్టుకొంది. ఈ వ్యాక్సిన్‌ వల్ల వ్యాధి సోకిన పశువులకు ప్రాణపాయం తప్పడంతోపాటు ముందుగానే టీకా వేసిన పశువులకు వ్యాధి సోకే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. తెలంగాణలో అన్ని పశువులకు ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్లే వ్యాధి ప్రభావం తక్కువగా ఉంది. లంపీస్కిన్‌ వ్యాధి నివారణకు గోట్‌పాక్స్‌ వ్యాక్సిన్‌ బాగా పని చేస్తుంది” అని ఆయన అన్నారు.