Telangana Mallareddy minister colleges houses raids
mictv telugu

మల్లారెడ్డి ఫోన్ గుంజుకున్న ఐటీ.. బంధువు ఇంట్లో భారీగా నగదు!

November 22, 2022

Telangana Mallareddy minister colleges houses raids

పన్ను ఎగవేత, లెక్కలు చూపకపోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, బంధువుల ఇళ్లలో, విద్యాసంస్థల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల భారీగా నగదు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. దగ్గరి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో, మరో బంధువు రఘునాథ రెడ్డి ఇంట్లో కోట్ల నగదును ఐటీ అధికారులు జప్తు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. త్రిశూల్ రెడ్డికి చాలా కాలేజీలు ఉన్నాయి.

సోదాలకు ముందు అధికారులు మల్లారెడ్డి మొబెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని బయటికి విషయం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 50 ఐటీ బృందాలు మొత్తం 14 కాలేజీలతోపాటు చాలా ఇళ్లలో, ఆఫీసుల్లో తనిఖీలు సాగిస్తున్నాయి. కాలేజీలు లావాదేవీలు జరిపిన బ్యాంకుల వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వరరావు ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. మల్లారెడ్డి కాలేజీల ఆర్థిక లావాదేవీలన్నీ బాలానగర్‌లోని క్రాంతి బ్యాంక్‌ శాఖలోనే జరిగినట్లు తేలడంతో రాజేశ్వరరావును కూడా విచారిస్తున్నారు. ఆయన మల్లారెడ్డితో కలసి కాలేజీలు నడుపుతున్నట్లు భావిస్తున్నారు. దశాబ్దాలుగా విద్యావ్యాపారంలో ఉన్న మల్లారెడ్డి భారీస్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక యూనివర్సిటీ, 38 ఇంజనీరింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు ఆయన పేరుపై ఉన్నాయి. మెడికల్ కాలేజీ సీట్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.