తెలంగాణ: 362.88 కోట్ల స్కాలర్‌షిప్‌లకు ఆదేశం: హరీశ్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: 362.88 కోట్ల స్కాలర్‌షిప్‌లకు ఆదేశం: హరీశ్ రావు

July 5, 2022

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన రూ.362.88 కోట్ల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్ రావు సోమవారం అధికారులను ఆదేశించారు.

ఈ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఆయన హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఉపకార వేతనాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులతో హరీశ్ రావు మాట్లాడుతూ..”గత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31లోపు ఆరు శాఖల నుంచి రావాల్సిన ఉపకార వేతనాలను వెంటనే రిలీజ్ చేయండి. బిల్లులను ట్రెజరీ అధికారులు వెంటనే క్లియర్ చేయండి. 2021-22 సంబంధించి ఉపకారవేతనాల బీఆర్వోలను విడుదల చేయండి” అని ఆయన అన్నారు. అనంతరం అధికారులు ‘ఆయా శాఖల్లోని కొన్ని బిల్లులు సకాలంలో అందలేదు. దాంతో వాటిని తిరిగి పంపించాము’ అని మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్సీ డెవలప్‌మెంట్ కమిషనర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.

మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు కోసం కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. కొన్ని కాలేజీలలో స్కాలర్‌షిప్‌లు రాక, కాలేజీల యాజమన్యాలు విద్యార్థులకు టీసీ, మోమోలు ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో విద్యార్థి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ఈ క్రమంలో స్పందించిన హరీష్ రావు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.