Telangana: Married and divorced young women are the target.. Seven marriages
mictv telugu

తెలంగాణ: పెళ్లై, విడాకులైన యువతులే టార్గెట్..ఏడు పెళ్లిళ్లు

July 14, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నివాసముంటూ ఓ వ్యక్తి మ్యాట్రిమోనిలో వచ్చిన ప్రకటనలను టార్గెట్ చేసి, ఇదివరకే పెళ్లై, విడాకులు తీసుకున్న యువతులను తన మాయమాటలతో నమ్మించి, ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, ఒకరికి తెలియకుండా మరోకరిని ఒకే కాలనీలోని మూడు వీధుల్లో ముగ్గురు భార్యలను ఉంచాడు. షిప్ట్‌ల పేర్లు చెప్తూ, ఒకరికి తెలియకుండా మరోకరి వద్ద లక్షలకు లక్షలు వసూలు చేశాడు. చివరికి అసలు నిజం బయటపడి కటకటాలపాలయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..”గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన అడపా శివశంకర్ బాబు ఇంజినీరింగ్ చదివాడు. మ్యాట్రిమోనీ సైట్లలో రెండో వివాహం కోసం పేరు నమోదు చేసుకున్న ఉన్నత విద్యావంతులు, ఉద్యోగం చేస్తున్న మహిళలను సంప్రదించాడు. తనకు వివాహమై, విడాకులు తీసుకున్నానని, ఓ కుమార్తె ఉందని, విడాకుల ధ్రువపత్రం చూపి వారిని నమ్మించాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగినని, దాదాపు రూ.2 లక్షల దాకా జీతం వస్తుందని పే స్లిప్ చూపించి, ఒకరికి తెలియకుండా మరోకరిని మోసం చేస్తూ, వారికి కొత్త జీవితం ఇస్తానని ఆశలు కల్పించి, ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లు వారితో నమ్మకంగా మాట్లాడి రూ. లక్షల్లో సొమ్ము గుంజి ఇప్పుడు మరో మహిళతో కాపురం చేస్తున్నాడు” అని వెల్లడించారు.

అయితే, మోసపోయిన వాళ్లలో ఉన్నత విద్యావంతులు, ఉద్యోగాలు చేస్తున్నవారే ఉన్నారు. ఈ క్రమంలో ఓ బాధిత మహిళ మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు శివశంకర్ బాబును పిలిపించారు. ఆ సమయంలో మరో మహిళతో స్టేషన్‌కు వచ్చిన అతను.. ఈమె తన భార్య అని చెప్పాడు. డబ్బు ఇచ్చే భరోసా తమదేనంటూ ఆమెనే మధ్యవర్తిగా ఉంచాడు. భార్యకు విడాకులు ఇచ్చానన్న వ్యక్తి మరో మహిళను భార్య అని చెప్పడం, రెండో మహిళకూ అనుమానం రావడంతో ఆ ఇద్దరు పర్సనల్‌గా మాట్లాడుకున్నారు. ఇద్దరినీ ఒకేలా మోసం చేసినట్లు, ఇద్దరికీ ఒకేలా చెప్పి రూ. లక్షల్లో డబ్బు లాగినట్లు తెలియడంతో పోలీసులకు చెప్పారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని విచారించగా సంచలన విషయాలను బయటపెట్టాడు.