ఎవరు వచ్చినా అంజలి ఘటించేలా.. అమరుల స్మారకం..  - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరు వచ్చినా అంజలి ఘటించేలా.. అమరుల స్మారకం.. 

September 18, 2020

Telangana Martyrs' monument, Construction work.. Visited Minister of Roads and Buildings Vemula Prashant Reddy

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున లుంబినీ పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను శుక్రవారం రహదార్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పర్యవేక్షించారు. పనుల పురోగతిని ఇంజినీర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరో ఆరు నెలల్లో ఈ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అమరుల త్యాగాలకు తగిన గౌరవం ఇచ్చేలా ప్రపంచమే అబ్బురపడేలా హైదరాబాద్‌ నడిబొడ్డున ఈ స్మారకం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. కేసీఆర్‌ రాజీలేని పోరాటం, ఎందరో అమరుల త్యాగాల ఫలితంతో ఏర్పడిన  తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని స్పష్టంచేశారు.

హైదరాబాద్‌‌కు ఎవరు వచ్చినా తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేలా స్మారకం ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావన అని మంత్రి తెలిపారు. ‘ఢిల్లీలో ప్రముఖులు బాపూజీకి నివాళులు అర్పించినట్లే.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ప్రముఖులు ఎవరు హైదరాబాద్‌ వచ్చినా.. తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించే సంప్రదాయం ఉండాలన్నది కేసీఆర్ ఆలోచన. అమరవీరుల త్యాగానికి ఏమాత్రం తగ్గకుండా తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించేలా ఈ కట్టడాన్ని నిర్మిస్తున్నాం. 28వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్మారకం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. డబ్బుకు వెనకాడకుండా ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో విభిన్నంగా స్మారకం నిర్మాణం జరుగుతోంది. ఈ స్మారకంలో సందర్శకుల కోసం ఆర్ట్‌ గ్యాలరీ, వీడియో గ్యాలరీ, లైబ్రరీ ఏర్పాటు చేయనున్నాం. 350 కార్లు, 600 బైక్‌లు పట్టేలా పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి అంతస్థులో  మ్యూజియం, ఫోటో గ్యాలరీ, సమావేశ మందిరం, ఆర్ట్ గ్యాలరీ ఉంటాయి. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నవారి త్యాగాలు ప్రతిబింబించేలా సందర్శకుల కోసం ఫోటో గ్యాలరీ ఉంటుంది. ఇక రెండో అంతస్తులో జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించేలా బెస్ట్ కన్వెన్షన్ హాల్ ఉంటుంది. మూడో అంతస్తులో రెస్టారెంట్స్ కూడా ఉంటాయి’ అని మంత్రి చెప్పారు.