కరోనా బాధిత జర్నలిస్టులకు 3.12 కోట్ల సాయం.. అల్లం నారాయణ  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా బాధిత జర్నలిస్టులకు 3.12 కోట్ల సాయం.. అల్లం నారాయణ 

October 23, 2020

Telangana media academy financial help to corona affected journalists

కరోనా వైరస్ బారినపడిన జర్నలిస్టులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ భరోసా ఇచ్చారు. వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతోపాటు పాత్రికేయులు కూడా కరోనా వారియర్స్‌గా మారి అసమాన సేవలు అందించారని ఆయన కొనియాడు. విధి నిర్వహణలో వైరస్ సోకి, ఇబ్బందులకు గురైన జర్నలిస్టులను ఆదుకోడానికి జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 1603 మందికి 3 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని ఆయన వెల్లడించారు. 

సమాచార భవన్‌లో ఆయన ఈ రోజు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న జర్నలిస్టులకు వార్తాసేకరణలో కరోనా సోకింది. వారిని ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. మీడియా అకాడమీ ద్వారా కరోనా పాజిటివ్ వచ్చిన 1517 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల చొప్పున మొత్తం రూ. 3 కోట్ల 3 లక్షల 40 వేలు అందింది.  ప్రైమరీ కాంటాక్ట్ కారణంగా హోం క్వారంటైన్లో ఉన్న 86 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున మొత్తం 8 లక్షల 60 వేలు ఆర్థిక సహాయం అందించాం’ అని ఆయన వివరించారు. మీడియా అకాడమీ తరఫున ఇలా ఆదుకోవడం ఒక మైలు రాయిని ఆయన పేర్కొన్నారు. 

కేసీఆర్ ముందుచూపుతో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల గ్రాంట్ ప్రకటించారని, అది పాత్రికేయులకు రక్షణ కవచంలా మారిందని అన్నారు. 34.50 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధికి జమ అయ్యాయని, దానిపై వచ్చిన వడ్డీ ద్వారా జర్నలిస్టులను ఆదుకుంటున్నామని వివరించారు. లాక్‌డౌన్ సమయంలో జీత భత్యాలు అందని పన్నెండు వందల మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులను మీడియా అకాడమి ఆధ్వర్యంలో పంపిణీ చేశామని గుర్తు చేశారు. 37 మంది జర్నలిస్ట్ మృతుల కుటుంబాలుమరో 10 మంది దీర్ఝకాలిక వ్యాధులు, ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని వారికి కూడా త్వరలో ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన ప్రకటించారు. 

కరోనా బాధిత జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్, గుర్తింపు కార్డు, మెడికల్ టెస్ట్ పత్రాలను, బ్యాంకు ఖాతాల వివరాలను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపితే వెంటనే సాయం చేస్తామని అల్లం నారాయణ చెప్పారు. తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ 8096677444 నెంబర్‌కు పంపాలని, మరిన్ని వివరాల కోసం మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ మొబైల్ నెంబర్  9676647807ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మీడియా అకాడమి కార్యదర్శి డి.ఎస్. జగన్, మేనేజర్ లక్ష్మణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.