వరంగల్ ఎంజీఎం మెడికల్ కాలేజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడైన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను శిక్షించాలని విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సైఫ్ తనకు హోం మంత్రి మహమూద్ అలీ బంధువని బెదిరించాడని ప్రీతి తండ్రి ఆరోపించడంతో కేసు రాజకీయ రంగు పులుపుకుంది. దీనిపై పురపాలక మంత్రి కేటీఆర్ సోమవారం స్పందించారు. అమ్మాయి చనిపోయినందుకు చాలా బాధపడుతున్నామని, తమ పార్టీ నేతలు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారని చెప్పారు. ‘‘దీనిపై రాజకీయం చేస్తున్నారు. ప్రతి చిన్న విషయంపైనా రాజకీయం చేస్తున్నారు. ప్రీతి కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున, మా అందరి తరఫున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. అన్ని రకాలుగా ఆదుకుంటాం. తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష తప్పదు’’ అని అన్నారు. ప్రీత కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం, ఒక సర్కారీ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం చెప్పడం తెలిసిందే.