హరీశ్ జన్మదినం..48 మంది అవయవ దానం
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈ రోజు 48వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఈరోజు ఉదయం 8గంటలకు మోహన్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో రంగారెడ్డి జిల్లా యువజన నాయకుడు పోలె సుధామ ఆధ్వర్యంలో 48 మంది యువకులు అవయవదానం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఎస్సి, ఎస్టీ కమీషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరయ్యారు. అవయవదానానికి ముందుకు వచ్చిన యువకులకు ఒప్పంద పత్రాలను ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ..'మనం బ్రతికి ఉన్నప్పుడు ఎం చేసాము అనే దాని కంటే…చనిపోయాక మనం చేసిన మేలు ఎంత సద్వినియోగం కావడం మన జన్మకు ఒక సార్థకతను ఇస్తుంది. దానికి ప్రతి రూపమే ఈ అవయవదానం. మన శరీరం మట్టిలో కలిసే ముందు కూడా బతికున్నపుడు పొందిన గౌరవాన్ని పొందే అవకాశం ఆర్గాన్ డోనేషన్ మనకి ఇస్తుంది. మనిషి జీవిత కాలంలో మంచి చెడు ఉంటాయి. తన తరువాత కూడా మంచి చేసే అదృష్టం ఆర్గాన్ డోనేషన్ ద్వార ఉంది. నువ్వు బతికి వున్నపుడు అదే కోరుకోవాలి తర్వాత కూడా అదే కోరుకోవాలి. అది కేవలం ఆర్గాన్ డోనేషన్ తోనే సాధ్యం.' అని అన్నారు.
అవయవదానం ద్వారా ఒక్క అవయవ దాత ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షలకు పైగా ప్రజలు అవయవాల వైఫల్యం కారణంగా మరణిస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. ఆధునిక వైద్యం ద్వారా మీరు చనిపోయిన సమయంలో మీ శరీరంలోని చాలా రకాల భాగాలు ఇతరులకు అమరిస్తే వారి ప్రాణాన్ని, జీవితాన్ని నిలబెట్టే అద్భుత అవకాశం మీకు కలుగుతుంది. మన దేశంలో సుమారు లక్షన్నర మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కిడ్నీల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ వారిలో కేవలం 3 వేల మందికి మాత్రమే కిడ్నీ దాతలు దొరుకుతున్నారు. దీంతో దాదాపు 90 శాతం మంది దాతల్లేక పాడైన అవయవాలతో చనిపోతున్నారు. అలాగే 25 వేల మంది కాలేయ మార్పిడి చేయించుకోవాల్సి ఉండగా వారికి 800 మంది మాత్రమే కాలేయ దాతలు దొరుకుతున్నారు. ఇలాంటి వారందరినీ కాపాడటం కోసం, వారి కొత్త జీవితాన్ని ఇవ్వటం కోసం మనం మన అవయవ దానాలు చేయాలి. మనం తుదిశ్వాస విడిచాకే మన శరీరం నుంచి అవయవాలు సేకరిస్తారు కాబట్టి మనం చనిపోయాక కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే సదావకాశాన్ని అవయవదానం కల్పిస్తోంది. ఇందుకోసం మీరు బతికున్నప్పుడే ఆర్గాన్ డోనర్ కింద పేరు నమోదు చేయించుకోండని వైద్య నిపుణులు తెలిపారు.