రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘మనకు ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, రాజకీయాలు కాదు. నాయకులకు చేతులెక్కి మొక్కుతున్నాను. రైతుల కోసం కలసి రండి. అందరం ఆలోచిద్దాం. భాగస్వాములం అవుదాం,’’ అని కోరారు. హరీశ్ రావు సోమవారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో సామాజిక ఆరోగ్య కేంద్ర పాత భవన మరమ్మత్తు అభివృద్ధి, 50 పడకల ప్రభుత్వ మాతాశిశు ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన, ఉచిత డయాలసిస్ కేంద్రం-రక్త శుద్ధీకరణ కేంద్ర ప్రారంభోత్సవం చేసి ప్రసంగించారు.
‘‘గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాల భూమికి సాగునీరు లభిస్తుంది. 50 వేల మంది రైతులకు మేలు జరుగుతుంది. ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, తర్వాతే రాజకీయాలు’’ అని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు మిగిలిన భూ సేకరణకు రూ.23 కోట్లు మంజూరు చేశామని, ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాజకీయ నాయకులు సహకరించాలన్నారు. ‘‘రాజకీయాల కోసం కాదు రైతుల కోసం ఆలోచించండి. ప్రాజెక్టు పనులు అడ్డుకోవద్దు. అన్ని వర్గాలు సహకరించాలి’’ అని కోరారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చామని, డయాలసిస్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కేవలం 3 డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు 102 ఉన్నాయని చెప్పారు.