దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్ష నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. తాజాగా ఈరోజు మంత్రి హరీష్ రావు మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుందంటూ బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. సిద్ధిపేటలో డబ్బుతో రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నరన్నారు.
ఈరోజు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..’నిధుల్లో వాటాపై చర్చకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? మీరు దుబ్బాక వస్తారా? నన్ను కరీంనగర్‌కు రమ్మంటారా? బీడీ కార్మికులకు కేంద్రం 16 పైసలు కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ నిజమే అయితే చర్చకు సిద్ధంగా ఉండాలి. దుబ్బాక పాత బస్టాండ్ వద్ద ప్రజల మధ్యే చర్చ పెడుదాం. ఒక వేళ బీడీ కార్మికులకు కేంద్రం రూ. 1600 పెన్షన్లు ఇస్తున్నట్లు నిరూపిస్తే నేను ఆర్థిక మంత్రి పదవికి, సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఒక వేళ నిరూపించకపోతే బండి సంజయ్ అదే పాత బస్టాండ్ వద్ద ముక్కు నేలకు రాయాలి?’ అని మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.