తెలుగు సంస్కృతి ప్రచారానికి, సానుకూల వార్తాప్రసారాలకు మైక్ టీవీ చిరునామా అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. మైక్ టీవీ అతికొద్ది కాలంలోనే అద్భుత ప్రగతి సాధించి దేశవిదేశాల్లోని కోట్లాది మంది తెలుగు ప్రజలకు చేరువైందన్నారు. ఆయన మంగళవారం మైక్ టీవీ కొత్త చానల్ ‘ఫోక్ స్టార్స్’ను ప్రారంభించారు. కనుమరుగవుతున్న తెలుగు జానపద కళలను, సాహిత్యాన్ని కొనవూపిరితో బతికిస్తున్న కళాకారులను ప్రతిభను రికార్డు చేయడానికి తీసుకొచ్చిన ఈ చానల్ ఎంతో విశిష్టమైందని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మైక్ టీవీ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి, సీఈఓ సతీశ్ మంజీర, వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రచయిత యశ్‌పాల్, ప్రముఖ జర్నలిస్ట్ బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
హరీశ్ రావు మాట్లాడుతూ ‘‘తెలంగాణ సంస్కృతిని, తెలుగువారి సంప్రదాయాలను కళ్లకు కట్టేలా మైక్ టీవీ ఎన్నో అద్భుతమైన పాటలను రూపొందించింది.
చిన్న బృందం ఇంత గొప్ప పని చేయడం హర్షణీయం. సంచలన వార్తలకు బదులు పాజిటివ్ వార్తలను, విభిన్న కథనాలను అందిస్తూ నేటి మీడియాలో భిన్నమైన చానల్‌గా నిలిచింది. మైక్ టీవీ నేడు మెయిన్ శాటిలైట్ చానళ్లతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. ఈ సంస్థను లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న అప్పిరెడ్డిగారిని అభినందిస్తున్నాను’’ అని అన్నారు. తెలుగు సంస్కృతికి విశిష్ట చరిత్ర ఉందని, మైక్ టీవీ దాన్ని అద్భుతంగా రికార్డు చేస్తోందని దేశపతి కొనియాడారు.
‘‘తెలంగాణ భాషను కేవలం హాస్యానికి వాడకుండా సాధారణ భాషగా వాడాలి. అందులో సంతోషం, వేదన అన్నీ ఉన్నాయి. అది జీవిత భాష. హాస్యం ఒక్కటే కాదు, అన్ని ఉద్వేగాలను పలికించాలి. మైక్ టీవీ ఈ దిశగా చేస్తున్న కృషి ప్రశంసనీయం’’ అని అన్నారు. తెలుగు సంస్కృతిని, తెలంగాణ పండుగలను, చరిత్రను విభిన్నంగా, కళాత్మకంగా ప్రచారంలోకి తీసుకురావడానికే మైక్ టీవీ ఉద్దేశమని అప్పిరెడ్డి అన్నారు. అంతరించిపోతున్న కళలను భావితరాల కోసం రికార్డు రూపంలో భద్రపరచాల్సిన బాధ్యత మనపై ఉందని, అందులో భాగంగానే ఫోక్‌స్టార్స్ చానల్ ప్రారంభిస్తున్నామని చెప్పారు.