టీఎస్పీఎస్సీ పశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. నేడు హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద బండి సంజయ్ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీకి కారణం ఐటీ వైఫల్యమేనని, దీనికి బాధ్యతగా కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేశారు.బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయలో ఆగ్రవ్యక్తం చేశారు. బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని మండిపడ్డారు.
మోదీని ప్రశ్నించే దమ్ముందా..?
“బండి సంజయ్‌కు ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థలపై అవగాహనలేదు. ఆయన ఒక దద్దమ్మ.పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న విషయం తెలియకుండా మాట్లాడుతున్నాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ శాఖ కాదన్న విషయాన్ని బండి సంజయ్ తెలుసుకోవాలి. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని ప్రభుత్వంపై తోసి కుట్ర చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టి వారిని రోడ్డెక్కిస్తున్నారు. రుద్యోగుల పట్ల మా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు భాజపాకు లేదు.గుజరాత్‌లో ఇప్పటికే 13 సార్లు ప్రశ్నపత్రం లీక్ అయింది. దీనిపై ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా? ” అని కేటీఆర్ ప్రశ్నించారు.
రేపు నిందితులకు కస్టడీ
మరోవైపు ప్రశ్నపత్రం లీకేజ్ కేసు నిందితులను పోలీసులు రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు. నిందితులను 6 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే చంచల్‌గూడ జైలులో ఉన్న వారిని కస్టడీలోకి తీసుకొని సిట్ అధికారుల ప్రశ్నించనున్నారు. రేపటి నుంచి ఈనెల 23 వరకు నిందితుల పోలీసు కస్టడీ కొనసాగనుంది.
పరీక్షలు రద్దు:
టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తులో మరిన్ని పరీక్ష ప్రశ్నపత్రాలు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో తేలడంతో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ , ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏఈఈ, డీఏవో పరీక్షల తేదీలు త్వరలో వెల్లడిస్తామని వివరించింది. ఇందులో భాగంగానే జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనట్లు పేర్కొంది.