మోదీ సర్కార్‌పై కేటీఆర్ సంచలన విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ సర్కార్‌పై కేటీఆర్ సంచలన విమర్శలు

December 4, 2019

Telangana minister ktr criticized central government 

కేంద్రప్రభుత్వంపై తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మాదాపూర్‌‌లోని శిల్పాకళా వేదికలో ఏర్పాటు చేసిన టీఎస్‌ఐపాస్‌ ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘తెలంగాణకు రావాల్సిన చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. అభివృద్ధి అనేది కేవలం నాగపూర్‌కేనా? దక్షిణాది రాష్ట్రాలకు వద్దా? బుల్లెట్‌ రైలు అంటే ఢిల్లీ, ముంబయి, ఇంకోవైపు రాదు. హైదరాబాద్‌ ముఖం కూడా చూడదు. ఈ రకమైన ప్రవర్తన కేంద్రానికి మంచిది కాదు. ఆలోచనలు మారాలి. ఇండస్ట్రియల్‌ కారిడార్ అంటే కేంద్రానికి హైదరాబాద్‌ ఎందుకు గుర్తురాదు. డిఫెన్స్‌ కారిడార్‌ను హైదరాబాద్‌-బెంగళూరు మధ్య కాకుండా వేరే చోట ఏర్పాటు చేస్తున్నారు. రక్షణ రంగంలో హైదరాబాద్‌ ప్రస్థానాన్ని మరిచి మరో చోట ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామికీకరణలో కేంద్రం రాజకీయాలు చేయకూడదు’ అని ప్రశ్నించారు. రక్షణ, వైమానిక రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. టీఎస్‌ఐపాస్‌ అనేది సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక అని కేటీఆర్ అన్నారు. పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్‌ను మారుస్తున్నామని, ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సార్ట్‌అప్ ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నామని, ఇందు కోసం 10 వేల ఎకరాలు సేకరించామని చెప్పారు.