హైదరాబాద్ నగర వాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నగర వ్యాప్తంగా ఫ్లైఓవర్స్ నిర్మిస్తున్న కేసీఆర్ సర్కార్ తాజాగా మరో ఫ్లై ఓవర్‌ను నూతన సంవత్సర కానుకగా ప్రారంభించింది. ఎస్సార్డీపీలో భాగంగా హైదరాబాద్ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ నేడు (జనవరి 1) ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ ద్వారా కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి రహదారిలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కొత్తగూడ-బొటానికల్ గార్డెన్ పై వంతెన నిర్మాణానికి రూ.263 కోట్లు ఖర్చు చేశారు.
తెలంగాణకు కల్పతరువు హైదరాబాద్
రాష్ట్రానికి హైదరాబాద్ నగరం కల్పతరువు వంటిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఫ్లై ఓవర్ అనంతరం ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. “ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తిచేశాం. మరో 11 ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసి అందుబాటులోకి తెస్తాం. రాబోయే మూడేళ్లలో 3,500 ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. గత వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది.మార్చి, ఏప్రిల్ నాటికి స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం పూర్తిచేస్తాం. వంద శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ కోసం 31 ఎస్టీపీల నిర్మాణం జరుగుతుంది. దీంతో దేశంలోనే తొలి వందశాతం సీవరేజ్ ట్రీట్మెంట్ సిటీగా హైదరాబాద్ అవతరించబోతుంది.” అని కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంటు సమస్యను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. రాబోయే 50 ఏండ్లకు సరిపడేలా కాళేశ్వరం, సుంకిశాల మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేశామని వెల్లడించారు.