Telangana minister ktr praises trs government over development of golla Shepperd community
mictv telugu

బయటివాళ్లు చెబితే తప్ప మన గొప్పతనం అర్థం కాదు.. కేటీఆర్

October 26, 2022

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎందరో మెచ్చుకుంటున్నారని, బయటి వాళ్లు చెబితే తప్ప మన గొప్పతనం మనకు అర్థం కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన యాదవ, కురుమల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

‘‘తెలంగాణ రాకముందు రాష్ట్రంలో గొల్ల కురుమల పరిస్థితి, కులవృత్తికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉండేది? తెలంగాణ వచ్చినంక ఎలా బాగా అయిందో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రం రాకముందు రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకం దారుల సొసైటీలో సభ్యులుగా ఉండేవారు. ఈరోజు ఆ సంఖ్య ఏడు లక్షల 61 వేలకు పెరిగారు. కులవృత్తులకు జీవం పోసే ఉద్దేశంతో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే ఆలోచనతో, రాష్ట్ర అభివృద్ధిలో గొల్ల కురుమలను భాగస్వాములను చేసేందుకు పదకొండు వేల కోట్ల రూపాయలతో రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేశాం. ఇలా ఆదుకుంటున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మన పథకాలు నంబర్ వన్‌గా ఉన్నాయని కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల, గిరిరాజ్ సింగ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ప్రశంసించారు.

బయటి వాళ్లు వచ్చి చెప్తే తప్ప మన గొప్పతనం ఏంటో మనకు అర్థం కావడం లేదు. గొల్ల కురుమ సోదరుల కోసం తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి పథకాలు దేశంలో మరెక్కడ అమలు కావడం లేదన్నది వాస్తవం. పరిశ్రమలు అంటే టాటాలు మాత్రమే కాదు తాతలనాటి కులవృత్తులు కూడా బాగుంటే దేశం కూడా బాగుంటుందనేది కేసీఆర్ గారి ఆలోచన. గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా యాదవుల ఆశీర్వాదం ఉండాలి’ అని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా జరపాలన్న గొల్ల కురుమల డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుందని పరిశీలిస్తుందన్న ఆయన సదర్ పండుగను అధికారికంగా జరిపే డిమాండును కూడా నెరవేరుస్తామన్నారు.