మీరా చోప్రా ఫిర్యాదుపై స్పందించిన కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మీరా చోప్రా ఫిర్యాదుపై స్పందించిన కేటీఆర్

June 5, 2020

telangana minister ktr responded to actress meera chopra tweet.jp

ఎన్టీఆర్ అభిమానులు తనను వేధిస్తున్నారంటూ నటి మీరా చోప్రా ఎంతో ఆవేదనతో ట్వీట్ చేసిన సంగతి తెల్సిందే. ”తారక్…నీ అభిమానులు నన్ను వేశ్య, పోర్న్ స్టార్ అని పిలుస్తారని అనుకోలేదు. నీకంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడమే దీనికంతటికీ కారణం అనుకుంటున్నా. కానీ, నీ అభిమానులు నా తల్లిదండ్రులకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు ఫీలవుతున్నారా? మీరు తప్పకుండా నా ట్వీట్ పట్ల స్పందిస్తారని ఆశిస్తున్నాను.” అంటూ ట్వీట్ లో పేర్కొంది. ఎన్టీఆర్ ను ఈ ట్వీట్ లో ట్యాగ్ చేసింది. ఈ ట్వీట్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నటుడు ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు.

ఈ అంశమై మీరా చోప్రా సైబర్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. అయినా కూడా తనకు బెదిరింపులు వస్తుండడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ట్వీట్ చేసింది. గ్యాంగ్ రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని, యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని, ఇంకా అనేక రకాలుగా దూషిస్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లింది. దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు. “మేడమ్, ఈ విషయాన్ని పరిశీలించాలని నేను తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ను కోరాను. మీ ఫిర్యాదుపై చట్టాన్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకోవాలని వారికి సూచించాను” అంటూ ట్వీట్ చేశారు. దీనిపై మీరా చోప్రా స్పందిస్తూ..”థాంక్స్ సర్… మీ మేలు మర్చిపోలేను. మహిళల భద్రతకు ఇది ఎంతో ముఖ్యం అని భావిస్తున్నాను. ఇలాంటి వాళ్లను స్వేచ్ఛగా వదలకూడదు, లేకుంటే మహిళలపై నేరాలు మరింత పెరుగుతాయి” అంటూ ట్వీట్ చేసింది.