మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమై విమర్శలు సంధించడం అనుకోకుండా జరిగిందా? ఎన్నాళ్లుగానో లోలోపల రాజుకుంటున్న అసంతృప్తి ఏ లక్ష్యం కోసం ఇలా బయటపడింది? మల్లారెడ్డి ఇతర ఎమ్మెల్యేల నియోజకర్గాల్లో వేలుపెడుతూ పదవులను తన అనుచరులకే ఇప్పించుకుంటూ ఉంటే అధిష్టానం చూస్తూ ఉరుకుంటోందా? ఈ పరిణామాలన్నీ దేనికి సూచన, ఇక ముందేం జరగబోతోంది?
లైమ్లైట్
మల్లారెడ్డి వివాదాలకు కేంద్రబిందువు. జోకులు, డ్యాన్సులు, అవినీతి ఆరోపణలు, ఐటీ దాడులు అన్నిటికీ ఆయనే కేరాఫ్ అడ్రస్. ఇతర మంత్రులకు, బీఆర్ఎస్ నేతలకు భిన్నంగా కనిపించడానికి ఇవే కారణం. ‘మా రెడ్డి అమ్మాయిలైతే రోజూ కిట్టీ పార్టీలు, పిక్నిక్లు, ఫంక్షన్లు అంటారు’ అని మల్లారెడ్డి ఇటీవల చేసిన చేసిన వ్యాఖ్యలు ఆయన లూజ్ ధోరణికి అద్దం పడతాయి. మెడికల్ కాలేజీ డొనేషన్లు, భూముల కబ్జాలు వంటి ఆరోపణలు ఎప్పుడూ ఉండేవే. నిత్యం ఏదో ఒక ఇష్యూతో లైమ్లైట్లో ఉంటున్న మల్లారెడ్డి పార్టీకి తలనొప్పిగా మారారని ఇరుగుపొరుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిలాలో పదవులు, పనులు విషయాల్లో ఆయన జోక్యం పెరిగిపోయిందని, తమ కేడర్ ఆందోళనచెందుతోందని సోమవారంనాటి సమావేశం తర్వాత మైనంపల్లి హనుమంతరావు, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు బాహాటంగానే మండిపడ్డారు. మల్లారెడ్డి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న ఈ ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. ‘మల్లారెడ్డి విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం,’ అని వీరు చెప్పారు. మరి విషయం తన దృష్టికి వచ్చినా కేసీఆర్ మల్లారెడ్డిపై చర్యలెందుకు తీసుకోలేదనే అనుమానం వస్తుంది. ఇటీవలే ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరయిన మల్లారెడ్డిని ఇప్పటికిప్పుడు మందలించడం బావుండదని అధినేత భావిస్తున్నారా? లేకపోతే ‘తెగేవరకు వేచిచూద్దాం’ అనే ధోరణి అవలంబిస్తున్నారా? అని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.
పదవులు ఇచ్చేది ఎవరు?
‘‘ఇది ఇంటి సమస్య. పదవులు ఇచ్చేది కేసీఆర్, కేటీఆర్. సమస్య ఉంటే కేసీఆర్తో మాట్లాడుకుందాం’’ అని అంటున్నారు మల్లారెడ్డి. ఆయనకు అధిష్టానమే అనవసరంగా ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యేల అలక. మల్లారెడ్డి మంత్రి కాబట్టి ఆయన మాట చెల్లుబాటవుతోందని అనుకుంటున్నారు. మల్లారెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారిన సీన్లో అధిష్టానం ఎవరివైపు నిలుస్తుంది? ఎమ్మెల్యేలు కోరినట్లు మల్లారెడ్డికి చెక్ పెడుతుందా? పెడితే ఏ విధంగా? అన్నది కాలమే చెప్పాలి. ‘తన స్థాయికి మించి మిడిసిపడుతున్న’ మల్లారెడ్డికి పొమ్మనకుండా పొగబెడుతున్నారా అనే ఊహాగానాలు రావడానికి కారణాలు బలంగానే కనిపిస్తున్నాయి కాబట్టి అధిష్టానం నిర్ణయం కోసం పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
దేశం కోసం మీ ఇళ్లల్లో కనీసం ‘కుక్క’ కూడా చావలేదు.. ఖర్గే
రంగంలోకి దిగ్విజయ్ సింగ్.. దిగొచ్చిన టీ కాంగ్రెస్ నేతలు
2 నెలల చంటిబిడ్డతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే ..