Telangana Minister Opens Fire In Air To Launch Freedom Rally
mictv telugu

పోలీసు తుపాకీతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు.. తనకు అర్హత ఉందట..

August 13, 2022

Telangana Minister Opens Fire In Air To Launch Freedom Rally

పోలీసు తుపాకిని తీసుకుని గాల్లోకి కాల్పులు జ‌రిపారు తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్. పోలీసుల చేతుల్లోని ఎస్ఎల్ఆర్ తుపాకీని త‌న చేతుల్లోకి తీసుకున్న ఆయ‌న జ‌నమంతా చూస్తుండ‌గానే గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఆ సమయంలో పోలీసు ఉన్న‌తాధికారులు అక్క‌డే ఉన్నా… ఆయ‌న‌ను వారించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో మంత్రి చేసిన ఈ పని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసినట్లయింది.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా భార‌త స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల పేరిట తెలంగాణ స‌ర్కారు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ మైదానం నుంచి క్లాక్‌టవర్‌ వరకు ఇవాళ అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఫ్రీడం ఫర్‌ ర్యాలీ చేపట్టింది. ర్యాలీ ప్రారంభించే సందర్భంలో.. తన పక్కన ఉన్న పోలీసు అధికారి నుంచి ఎస్ఎల్ఆర్ వెపన్‌ను తీసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఊహించని విధంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు, వీడియోల‌ను చూసిన నెటిజ‌న్లు.. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జ‌రుపుతారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. కొందరు తీవ్రంగా విమర్శించారు.

దీంతో ఈ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అంటూ మంత్రి వివరణ ఇచ్చారు. తాను ఎవరి వద్ద గన్ తీసుకొని కాల్చలేదని స్వయంగా ఎస్పీ ఇస్తేనే కాల్చానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తాను రైఫిల్ అసోసియేష‌న్ స‌భ్యుడిన‌ని, క్రీడా శాఖ మంత్రిగా త‌న‌కు ఇలా గాల్లోకి కాల్పులు జ‌రిపే అర్హ‌త ఉంద‌ని కూడా ఆయ‌న తెలిపారు. టీవీలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. తనపై అసత్య కథనాలతో బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు. ఫోన్ లైన్ లో ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.