దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలుగు రాష్టాల నుంచి ప్రతినిధులు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ తరపున ఐటీ మంత్రి కేటీఆర్, కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు వెళ్లారు. ఏపీ తరపున ముఖ్యమంత్రి జగన్, మంత్రి అమర్ నాథ్ తదితరులు వెళ్లారు. అక్కడ ఇరు రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో వీరు చర్చిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు కూడా కొన్ని కంపెనీలు పెట్టుబడి పెడతామని ప్రకటించాయి. ఇదిలా ఉండగా, ఈ పర్యటనపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘
తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్లో అడుగుపెట్టిన తొలిరోజే వెయ్యి కోట్ల పెట్టుబడులు సాధిస్తే, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రిపై మాత్రం ఈగ కూడా వాలలేదు’ అని కామెంట్ చేశారు. ఈ వీడియోను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. కొందరు టీడీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. విదేశాల్లో మన ముఖ్యమంత్రి పరువు పోయిందని ఒకరు, అంత మాట అనేశారేంటండీ అని మరొకరు కామెంట్ చేశారు. కాగా, ఇటీవలే కేటీఆర్ ఏపీలోని రోడ్ల పరిస్థితినుద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. అది కొద్ది రోజులకే సద్దుమణిగింది. దావోస్ పర్యటనలో కేటీఆర్, జగన్ ఇద్దరూ కలుసుకొని ఫోటోలు దిగారు. వాటికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతలో మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దుమారం రేగుతోంది.