సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడైన హిమాన్షు రావు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుండడం తెలిసిందే. ఓక్రిడ్జ్ స్కూల్లో చదువుకుంటున్న అతడు తాజాగా ఓ ఈవెంట్‌ను సమర్థమంతంగా నిర్వహించి ప్రశంసంలు అందుకున్నాడు. సృజనాత్మక, సామాజిక దృక్పథం థీంతో నిర్వహించిన కాస్నివాల్ (CASnival)కు ఇన్‌చార్జిగా హిమాన్షు వ్యవహరించాడు. ఇందులో 30కి పైగా స్టాళ్లతో విద్యార్థులు కళాత్మకతను ప్రదర్శించారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన ఈ ఈవెంట్‌లో ఓక్ జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై హిమాన్షును, అతని స్నేహితులను అభినందించారు. ‘‘నేటితరం పిల్లల ఆలోచన విధానానికి ఈ కాస్నివాల్ ఉదాహరణ. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి ఈవెంట్స్ విద్యార్థులకు ఇస్తాయి. కేసీఆర్ మనవడిగా సమాజానికి ఉపయోగపడే మంచి ఆలోచనలతో హిమాన్షు తన మిత్ర బృందంతో కలిసి పనిచేయడం సంతోషం’’ అని పేర్కొన్నారు. కాస్నివాల్‌తో సమకూరే డబ్బులతో నానక్ రామ్ గూడ చెరువును పునరుద్ధరిస్తామని హిమాన్షు చెప్పాడు. చెరువులను ఎలా పరిరక్షించాలనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, వారిని పర్యావరణవేత్తలుగా మార్చడమే తమ మిత్ర బృందం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నటులు నిఖిల్, కిరణ్ అబ్బవరం సందడి చేశారు.