కరోనా మృతుడి అంత్యక్రియల్లో తెలంగాణ మంత్రి.. భయపడొద్దు..  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా మృతుడి అంత్యక్రియల్లో తెలంగాణ మంత్రి.. భయపడొద్దు.. 

August 10, 2020

Telangana minister srinivas goud attend at Corona's funeral .. don't be afraid ...

కరోనా వైరస్ సోకిన వారు ఇంటి ముందు ఉంటేనో, ఊర్లో ఉంటేనో.. ఇరుగుపొరుగువారు  అనరాని మాటలు అంటున్నారు. దీంతో వారి మాటలు భరించక కొందరు గుండె పగిలి చచ్చిపోతున్నారు. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు చూస్తున్నాం. కరోనా కన్నా సాటి మనుషుల తీరే వారిని కాల్చుకు తింటోంది. ఇక కరోనాతో చచ్చిపోయినవారి పట్ల సొంత బంధువులే విముఖత చూపడం వంటి దారుణాలు కూడా చూస్తున్నాం. దిక్కులేని చావు చచ్చినంత పని అవుతోంది. తుది కర్మలు, కడసూపు కూడా దక్కకుండా ఎందరో దిక్కులేని శవాల్లా జేసీబీలతో ఖననం అయ్యారు. దీంతో చాలామంది కరోనా చావు రావొద్దని కోరుకుంటున్నారు. అయితే అలాంటి వారి కళ్లు తెరిపించడానికి తెలంగాణ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ముందుకు వచ్చారు. 

సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కరోనా రోగి అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నంత మాత్రానా కరోనా రాదని ఆయన అన్నారు. అంత్యక్రియలకు ఆయన పీపీఈ కిట్ వేసుకుని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గాంధీ, ఇతర ఆసుపత్రులలో కరోనాతో చనిపోయిన వారిని వారి పిల్లలే తీసుకువెళ్లడానికి ముందుకు రావడంలేదు. ఇది మనుషుల్లోని మృగత్వాన్ని సూచిస్తుంది. కరోనా నిబంధనల ప్రకారం పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియల్లో పాల్గొనవచ్చు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నాను. అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా ముందుకు రారని తెలిసి ఉంటే అలాంటివారిని కనడమే వృథా అని తల్లిదండ్రులు భావించే వారు. కరోనాతో చనిపోయిన తల్లిదండ్రుల్ని తీసుకువెళ్లడానికి ముందుకు రాని వారి జన్మ వృథా. అపోహలు వీడి ఆప్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కోరుతున్నా’ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. కాగా, మంత్రి స్ఫూర్తివంతమైన నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.