జానకీపురం సర్పంచ్ నవ్యను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక మెట్టు దిగి వచ్చారు. జరిగిన దానికి చింతిస్తున్నట్లు ఆయన మీడియా ముఖంగా పేర్కొన్నారు. భర్త సమక్షంలో సర్పంచ్ నవ్యతో మాట్లాడిన రాజయ్య ఆమెకు క్షమాపణలు చెప్పారు. నవ్య దంపతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు రాజయ్య.
మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడారు..” నాకు నలుగురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. ప్రవీణ్ పైన అభిమానంతోనే నవ్యకు సర్పంచ్ టికెట్ ఇచ్చాను. తెలిసీ తెలియక తప్పు చేస్తే నన్ను క్షమించండి. ప్రవీణ్ ఆహ్వానం మేరకే ఇక్కడికి వచ్చాను. జరిగిన పరిణామాలకు నేను చింతిస్తున్నాను. నా వల్ల మానసిక క్షోభకు గురైతే నన్ను క్షమించండి. అందరూ కలిసికట్టుగా పని చేయాలని పార్టీ తెలిపింది. పార్టీ అధిష్టానం మేరకు నడుచుకుంటాను. ఇప్పటి వరకు ఏ గ్రామం పట్ల వివిక్ష చూపించలేదు. అధిష్టానం చెప్పిన విధంగా జానకీపురం అభివృద్ధి కోసం రూ.25 లక్షల నిధులను తక్షణమే మంజూరు చేస్తున్నాను. ప్రాణం ఉన్నంత వరకు మహిళల ఆత్మ గౌరవం కోసం కృషి చేస్తాను.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా కమిషన్ విచారణకు సిద్ధమైంది. నవ్య విషయాన్ని సుమోటోగా తీసుకుని రాజయ్యను వ్యక్తిగతంగా విచారణ చేయాలని నోటీసులు జారీ చేసింది. ట్విట్టర్ వేదికగా మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు