హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఉత్కంఠతకు తెరపడింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. సుమారు 1150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. కాగా క్రాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి నాలుగో రౌండ్లోనే ఓడిపోయారు.
కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ సరూర్‌నగర్ స్టేడియంలో మార్చి 16వ తేదీ రాత్రి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 17వ తేదీ ఉదయం 4.30 గంటల వరకు మందకొడిగా కొనసాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్ధులు ఎవరూ మ్యాజిక్ ఫిగర్ 12,709 దాటలేకపోయారు. 50 శాతానికి మించి మెజారిటీ ఎవరికీ దక్కలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనివార్యమైంది. మూడో స్థానంలో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీ చేశారు.