కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు కొన్నేళ్లుగా వస్తున్న వార్తలు, ఊహాగానాలు ఇటీవల మళ్లీ ఊపందుకోవడం తెలిసిందే. రాజగోపాల్ తమ పార్టీలో చేరుతున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్లే నేతలు పార్టీలు వీడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.
’రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పార్టీలో అంతర్గతంగా చర్చిస్తాం. ఆయన పార్టీని ఎందుకు వీడుతున్నారో మాట్లాడుకుంటాం. మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది.’ అని ఆయన అన్నారు.కాగా, రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడకముందే ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. పార్టీ నుంచి బహిష్కరించాలని కొందరు నేతలు అంటుండగా, చివరి ప్రయత్నంగా మాట్లాడి చూద్దామని భట్టి విక్రమార్క వంటి నేతలు చెబుతున్నట్లు సమాచారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వీడి ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడుకు వచ్చే ఉప ఎన్నికలను ఎదుర్కోడానికి పార్టీలు ఇప్పట్నుంచే కసరత్తు చేస్తున్నాయి.