తెలంగాణలో హంగ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు: కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవక తప్పదని , ఇద్దరికీ అరవై మించికి సీట్లు రావని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ సెక్యులర్ పార్టీలేనని ఆయన అన్నారు. “ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప కాంగ్రెస్ కు మెజార్టీ రాదు. కాంగ్రెస్ 40 నుంచి 50 స్థానాలను గెలుచుకుంటుంది, బీఆర్ఎస్ 60 స్థానాలను కూడా గెలుచుకోలేదు. కేసీఆర్ .. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి.. మిగిలిన ఆప్షన్ కాంగ్రెస్సే. హంగ్ నేపథ్యంలో కచ్చితంగా కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది” అని అన్నారు.
కాంగ్రెస్ గాడిలో పడుతుందన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త అయినా.. పాత అయినా గెలిచే వారికే టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. ఎన్నికలకు ముందు ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎన్నికల తర్వాత పొత్తులు ఉండే అవకాశముందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. మార్చి 1 నుంచి తాను పాదయాత్ర, బైక్ యాత్ర చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కేసీఆర్ పొగడ్తలు కురిపించడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై మరోసారి ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై పాదయాత్రలో స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అండ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ బీఆర్ఎస్‌తో కలిసేదే లేదని తేల్చిచెప్పారు. కాలనాగునైనా కౌగిలించుకుంటామని, కేసీఆర్‌తో మాత్రం కలిసేదే లేదని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా కోమటిరెడ్డి మాత్రం 2023 ఎన్నికల్లో హంగ్ వస్తుందని, కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని చెబుతున్నారు. రేవంత్ వర్గం మాత్రం వ్యతిరేకిస్తుండడంతో రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటువైపు తారితీస్తాయో వేచి చూడాలి.