Telangana: New rules that have come into force.. Now Rs. 1000
mictv telugu

తెలంగాణ: అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్..ఇకపై రూ. 1000

October 3, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని వాహనదారులకు పోలీసులు కాసేపటిక్రితమే ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. నేటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయని తెలియజేస్తూ, కొన్ని జరిమానాలకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటలో పేర్కొన్నారు. ఇకపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే, బాదుడు తప్పదని హెచ్చరించారు.

”ఈరోజు నుంచి హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై అన్ని వాహనాల యాజమానులు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే భారీగా జరిమానాలు విధించబడతాయి. ఇంతకుముందులా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మీ జేబులు ఖాళీ కావడం ఖాయం. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంలో భాగంగా ట్రాఫిక్ నూతన నిబంధనలు తీసుకొచ్చాం. ఇప్పటివరకు సిగ్నల్ లైన్ క్రాస్ చేసినా పెద్దగా పట్టించుకునేవాళ్లం కాదు. కానీ, ఈరోజు నుంచి సిగ్నల్ వద్ద ఉండే వైట్‌లైన్ క్రాస్ చేస్తే, రూ. 100 జరిమానా చెల్లించాలి. ఫ్రీలెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ. 1000 చెల్లించాలి. పాదచారులకు అడ్డంగా వాహనాలు నిలిపితే, రూ. 600 చెల్లించాలి. రాంగ్ పార్కింగ్‌లో ఫోర్ వీలర్ పార్క్ చేస్తే, రూ. 600 చెల్లించాలి. అంతేకాదు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.” అని పేర్కొన్నారు.

అంతేకాదు, బైకర్లు హెల్మెట్ లేకుండా ప్రయాణించినా, కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్టు ధరించకున్నా, అతి వేగంతో ప్రయాణించినా, నో పార్కింగ్ జోన్‌లో వాహనాలు నిలిపినా చర్యలు కఠినంగా ఉంటాయని అధికారలు తెలియజేశారు. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించడం ద్వారా జరిమానాలకు దూరంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కావున ప్రతి వాహనదారుడు తమ వాహనాన్ని రోడ్డుపై నడిపే క్రమంలో ఇక నుంచి అన్ని రకాలుగా ఆలోచించి, ప్రభుత్వ సూచలను ఫాలో కావాలని విశ్లేషకులు కోరుతున్నారు.