తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయం దాదాపు పనులు పూర్తయ్యాయి. ప్రారంభ తేదీని కూడా ప్రభుత్వం వెల్లడించింది. 2023, జనవరి 18 వ తేదీన కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ఆ రోజు సీఎం కేసీఆర్ 6వ అంతస్తులోని ముఖ్యమంత్రి బ్లాకును ప్రారంభించి తన చాంబర్లో విధులు కొనసాగిస్తారు.
ఆ రోజు నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు అక్కడి నుంచే మొదలవుతాయి. మిగిలిన అరకొర పనులు ఆ రోజుకల్లా పూర్తి చేయాలని నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ కంపెనీని ప్రభుత్వం ఆదేశించింది. పాత సచివాలయాన్ని కూలగొట్టి అక్కడే కొత్తది కట్టారు. దీని వాస్తులో తెలంగాణ చరిత్ర, విభిన్న సంస్కృతులను ప్రతిబింబించారు. మొత్తం భవనం వైశాల్యం దాదాపు 7 లక్షల చదరపు అడుగులు. ఈ భవనంలో 3 అంతస్తుల అరైవల్ గ్రాండ్ పోర్టికో, 15 అడుగుల ఎత్తయిన ఎంట్రీ పోడియం ఉన్నాయి. 650 కార్లు, 500 ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంకు, ఏటీఎం, పెట్రోల్ బంకు, డిస్సెన్సరీ వంటి సకల సదుపాయాలూ ఉన్నాయి.