తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఏప్రిల్ 30న కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నూతనంగా నిర్మించిన సచివాలయానికి డా.బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. కాగా జూన్ 2న తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెలంగాణ నూతన సచివాలయానికి వెళ్లారు. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిన ఆయన.. అక్కడ సచివాలయ పనులను పరిశీలించారు. పనులు చివరి దశకు రావడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇన్నాళ్లూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల సచివాలయాన్ని ప్రారంభించే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు పనులన్నీ దాదాపు పూర్తి కావడంతో… ఏప్రిల్ 30న ప్రారంభించడానికి సరైన తేదీగా నిర్ణయించారు. నూతన సెక్రటేరియట్ భవన ప్రారంభానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలను సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏప్రిల్ 30 వరకూ టైమ్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇదివరకు రెండుసార్లు సచివాలయ ప్రారంభం వాయిదా పడింది. ఈసారి మాత్రం ఏప్రిల్ 30న కచ్చితంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ తాతా మధు, సీఎస్ శాంతి కుమారి, సీపీ సీవీ ఆనంద్ ఉన్నారు.