తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ త్వరలోనే మరో తీపికబురు చెప్పనుంది. టీచర్ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మరికొద్ది రోజులలో పాఠశాల విద్యాశాఖతోపాటు గురుకులాలు, మాడల్ స్కూళ్లల్లో టీచర్ పోస్టుల భర్తీ కోసం అధికారులు చర్యలు చేపట్టినట్లు శుక్రవారం తెలిపారు.
ఇప్పటికే 9,096 టీచర్ పోస్టుల భర్తీకి జూన్ 17న ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా భర్తీచేసేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ క్రమంలో టీచర్ ఉద్యోగాలకు ముందు అర్హత పరీక్ష అయిన టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్ 12 పరీక్షను నిర్వహించి, శుక్రవారం ఫలితాలను వెల్లడించారు. ఇక, నోటిఫికేషన్లు ఇవ్వడం మాత్రమే మిగిలింది.
తెలంగాణ వచ్చాక 2016 మేలో, 2017 జూలైలో టెట్ నిర్వహించారు. గతంలో టెట్ వ్యాలిడిటీ ఏడేండ్లు ఉండగా, ఇటీవలే దానిని జీవితకాలం పొడిగిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో క్వాలిఫై అయిన వారికి సమస్యలేకపోగా, 2017 అంతకు ముందు క్వాలిఫై కానివారితోపాటు ఇటీవల ఉపాధ్యాయ విద్య కోర్సులను పూర్తిచేసిన వారికోసం జూన్ 12న టెట్ నిర్వహించారు. ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. ఈసారి టీచర్ ఉద్యోగాలకు టెట్ అర్హతను తప్పనిసరి చేస్తూ, అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.