తెలంగాణ: టీజీటీ, ఎస్‌జీబీటీ, వార్డెన్ పోస్టులకు ప్రకటన విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా, నల్గొండ జిల్లా (మిర్యాలగూడ), హైదరాబాద్‌లోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్తను చెప్పింది. తెలంగాణ దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన టీజీటీ, ఎస్‌జీబీటీ, వార్డెన్ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 42 పోస్టులు ఉన్నాయని వివరాలను వెల్లడించారు.
అధికారులు మాట్లాడుతూ.."కరీంనగర్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీజీటీ, ఎస్‌జీబీటీ, వార్డెన్ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నాం. ఈ ఉద్యోగాలకు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, స్పెషల్ డీఈడీ (హెచ్‌హెచ్/వీహెచ్), స్పెషల్ బీఈడీ(వీహెచ్/హెచ్‌హెచ్), ఎంఏ (సోషల్ వర్క్/సోషియాలజీ), డీపీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇంగ్లీష్ మీడియంలో బోధన నైపుణ్యాలున్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. రిటైర్ అయిన టీచర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://wdsc.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి" అని తెలిపారు.
ఇక, 42 పోస్టుల్లో ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 15, ఎస్‌జీబీటీ టీచర్లు 15, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 2, వార్డెన్ పోస్టులు 10 ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు [email protected] అనే ఈ మెయిల్‌కు బయోడేటాను పంపించాలి. చివరి తేదీగా జులై 14,2022గా అధికారులు తెలిపారు.