తెలంగాణ: 65 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: 65 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

July 7, 2022

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ తీపికబురుల మీద తీపికబురులు చెప్తూనే ఉంది. కేసీఆర్ అసెంబ్లీలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని ప్రకటించిన రోజు నుంచి ఇప్పటివరకూ పోలీస్, గ్రూప్-1, విద్యుత్ శాఖల నుంచి నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ హైకోర్టు నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. హైకోర్టులో ఖాళీగా ఉన్న 65 ఉద్యోగాలకు హైకోర్టు అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 65 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో జ‌డ్జిలు, రిజిస్ట్రార్ల ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీలు, కోర్టు మాస్ట‌ర్ల పోస్టుల‌ు ఉన్నాయి. అయితే, ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ 65 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. దేశంలోని ఏ యూనివ‌ర్సిటీ నుంచైనా డిగ్రీ లేదా లా విద్య‌ను అభ్య‌సించిన వారంద‌రూ ఈ పోస్టుల‌కు అర్హులేనని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇక, ”ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకునే వారికి 2022, జులై 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి. 34 ఏండ్ల వ‌య‌సు మించ‌రాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరికి చెందిన అభ్య‌ర్థుల‌కు వ‌యోప‌రిమితి సడలింపు ఇచ్చారు. ఓసీ, బీసీ కేట‌గిరిల వారు రూ. 800 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరి అభ్య‌ర్థులు రూ. 400 చెల్లించాలి. డీడీల‌ను ది రిజిస్ట్రార్(రిక్రూట్‌మెంట్‌), తెలంగాణ హైకోర్టు పేరిట తీయాలి. ద‌ర‌ఖాస్తుల‌ను స్పీడ్ పోస్టు లేదా కొరియ‌ర్ ద్వారా జులై 22న సాయంత్రం 5 గంట‌ల్లోపు తెలంగాణ హైకోర్టుకు పంపాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://tshc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి” అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.