Telangana: Now secret agents in all schools..
mictv telugu

తెలంగాణ: ఇకపై అన్ని పాఠశాలల్లో షీక్రెట్ ఏజెంట్స్..

October 1, 2022

Telangana: Now secret agents in all schools..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విషయంలో మరో ముందడుగు వేసింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ, కాలేజీల్లోనూ, ప్రభుత్వ వసతి గృహాలలోనూ షీ టీమ్స్ గూఢచారులను (షీక్రెట్ ఏజెంట్స్) ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు.

అయితే, ఈ నిర్ణయానికి గల కారణాలను కూడా అధికారులు తెలియజేశారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లోని పాఠశాలలు, వసతి గృహాల్లో మైనర్లపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో సెలవుల్లో ఇంటికి వెళ్లిన పిల్లల్లో..వారి ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆరా తీయగా, అసలు విషయాలు వెల్లడౌతున్నాయి. మరోపక్క జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాలంటే పిల్లల్లో నెలకొన్న భయం, ఇతరత్రా కారణాలతో విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త కార్యాచరణ రూపొందించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు, ప్రభుత్వ వసతి గృహాలలో షీ టీమ్స్ గూఢచారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ షీక్రెట్ ఏజెంట్స్ పని తీరు ఎలా ఉంటుందంటే..”ప్రతి సంస్థలో వంద మంది విద్యార్థులకు 5-10 మంది ఆసక్తి ఉన్న వలంటీర్లను గూఢచారులుగా ఎంపిక చేసి, వారికి గుడ్, బ్యాడ్ టచ్‌లతోపాటు, పోక్సో చట్టం, కేసులు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆకతాయిలపై ఎలా నిఘా వేయాలి, పోలీసులను సంప్రదించే తీరు, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఆయా విద్యా సంస్థలు, వసతి గృహాలలోని విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వెంటనే బృందం సభ్యులు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారు” అని అధికారులు తెలియజేశారు. ఈ శిక్షణ ద్వారా మైనర్లలో ధైర్యం, పోలీసులంటే భయం పోయి, నేరాలు ఎక్కడ జరిగినా, వెంటనే సమాచారం అందుతుందని అధికారులు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.